Telugu Short Stories

మంత్రాల మర్రిచెట్టు (సరదా జానపద కథ)

మంత్రాల మర్రిచెట్టు — పనీ పాటా లేని ఎల్లన్న సరదా కథ. పిల్లలను నవ్వించే తెలుగు జానపద కథ.

ఒకూర్లో ఎల్లన్నని ఒకడుండేటోడు. వాడు ఏ పనీ చేసేటోడు గాదు. ఎప్పుడు చూడు అల్లరిచిల్లరగా తిరుగుతా, వాళ్ళలో వీళ్ళతో గొడవలు పడతా, దొంగతనాలు చేస్తా బతికేటోడు.
వాళ్ళూరికి ఒక రోజు ఒక ముని వచ్చినాడు. ఆ మునికి చానా మహిమలున్నాయని ఊరంతా గొప్పగా చెప్పుకొనేటోళ్ళు. అందుకే జనాలంతా కుప్పలు తెప్పలుగా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోని పోయేటోళ్ళు.
ఎల్లన్న అదంతా చూసి “ఈ ముని దగ్గర నిజంగానే మంచి మహిమలున్నట్టున్నాయి. ఎట్లాగైనా సరే ఏ పనీ చేయకుండా కావాల్సినవన్నీ క్షణాల్లో చేతికందే మంత్రం ఏదైనా వుంటే కనుక్కోవాల” అనుకున్నాడు.
ఆరోజు రాత్రి ఊరంతా నిద్రపోయినాక మట్టసంగా ముని వున్న ఇంట్లోకి దూరినాడు. నిద్రపోతా వున్న మునిని లేపి, కత్తి మెడ మీద పెట్టి “చూడు సామీ! నేనంత మంచోన్ని కాను. చానా చానా దుర్మార్గున్ని. నేనేం కోరుకుంటే అది క్షణాల్లో నా దగ్గరికి చేరే మంత్రం మర్యాదగా చెప్పు. లేకుంటే నిన్ను ఇక్కన్నే పొడిచి చంపేస్తా” అని భయపడిచ్చినాడు.
దానికా ముని చిరునవ్వు నవ్వి “చూడు నాయనా! మనిషి పుట్టుక పుట్టినాక సొంతంగా సంపాదిచ్చుకోని బతకాలగానీ ఇట్లా తేరగా వచ్చే దాండ్ల గురించి ఆలోచించకూడదు. దురాశ మంచిదిగాదు. నా మాటిని ఈ దొంగతనాలు మాని హాయిగా ఏదయినా పని చేసుకోని బతుకుపో” అన్నాడు.
దానికి వాడు కోపంగా “ఏంది సామీ! మర్యాదగా అడుగుతా వున్నా కదాని నాకే నీతులు చెప్తా వున్నావా. వెంటనే మంత్రం చెప్తావా, కసుక్కున పొడిచేయమంటావా” అన్నాడు కత్తి పైకెత్తి.
అప్పుడా ముని కాస్త ఆలోచించి “నీ కర్మ. చెప్తా విను. ఇక్కడికి పక్కనే ఒక అడవి వుంది గదా… దాంట్లో చక్కగా మూడుమైళ్ళు పో. అక్కడ ఒక చిన్న గుడుంటాది. ఆన్నుండి తూర్పు దిక్కుకు తిరిగి చక్కగ మరో మూడుమైళ్ళు పో. అక్కడ ఒక పెద్ద మర్రిచెట్టు కనబడతాది. అది మామూలు మర్రిచెట్టు కాదు. కోరికలు తీర్చే కామధేనువు లాంటి మంత్రాల మర్రిచెట్టు. నువ్వు మంచి కోరుకుంటే మంచి జరుగుతాది. చెడు కోరుకుంటే చెడు జరుగుతాది. జాగ్రత్త” అని చెప్పినాడు. దానికి ఎల్లన్న “నువ్వు చెప్పినట్టే పోతావున్నా కానీ నువ్వు చెప్పినేది అబద్దమనుకో, మళ్ళా వచ్చి నీ అంతు తేలుస్తా” అని బెదిరిచ్చి బైలుదేరినాడు. దొంగోడు పొద్దున్నే అడవికి చేరుకోని చక్కగా ఒక మూడుమైళ్ళు పోగానే ముని చెప్పినట్టుగానే ఒక చిన్నగుడి కనబడింది. అక్కన్నించి తూర్పు దిక్కుకు తిరిగి మళ్ళా కిందా మీదా పడతా మూడుమైళ్ళు నడవగానే ఒక మర్రిచెట్టు కనబడింది.
వాడా చెట్టు కింద నిలబడి “నడిచీ నడిచి ఒళ్ళంతా చెమటలు పట్టినాయి. ఇక్కడ గనుక ఒక చెరువుంటే ఎంత బాగుండు. హాయిగా స్నానం చేస్తావుంటి” అనుకున్నాడు. వాడట్లా మనసులో అనుకోవడం ఆలస్యం, టక్కున ఎదురుగా ఒక పెద్ద చెరువు ప్రత్యక్షమయ్యింది.
ఎల్లన్న ఆ చెరువును చూసి ఆశ్చర్యపోయి “ఐతే ఇదేనన్నమాట ఆ ముని చెప్పిన మంత్రాల మర్రిచెట్టు” అనుకోని సంబరంగా చెరువులో దూకి బాగా ఈత కొట్టి, స్నానం చేసి ఆ చెట్టు కిందికి వచ్చినాడు. వచ్చి “వేసుకోడానికి మాంచి ఖరీదైన బట్టలుంటే ఎంత బాగుండు” అనుకున్నాడు.
వాడట్లా మనసులో అనుకోవడం ఆలస్యం ఠక్కున మంచి మంచి పట్టుబట్టలు అక్కడ ప్రత్యక్షమయినాయి. వాడు సంబరంగా అవి వేసుకున్నాడు.
వాడు చానా దూరం నుంచి నడిచి వచ్చినాడు గదా… దాంతో బాగా ఆకలేయసాగింది. “కడుపు నకనకలాడిపోతా వుంది. మాంచి విందు భోజనం దొరికితే ఎంత బాగుండు” అనుకున్నాడు. వాడట్లా అనుకోవడం ఆలస్యం పండ్లు, తినుబండారాలు, పానీయాలు తాంబూలాలు… ఒక్కటేమిటి లోకంలో యాడాడ వున్నవన్నీ క్షణంలో వాని ముందు ప్రత్యక్షమైనాయి. వాడు ఆనందంగా వానికిష్టమైనవన్నీ బాగా తిన్నాడు. అప్పటికే సాయంకాలమైపోయింది.
దాంతో వాడు “నాకు మోయలేనంత బంగారం, వజ్రాలు దొరికితే ఎంత బాగుండు. హాయిగా జీవితమంతా కాలు మీద కాలేసుకోని బతుకుతా వుంటి” అనుకున్నాడు. వాడట్లా మనసులో అనుకోవడం ఆలస్యం వాని ముందు కుప్పలు కుప్పలుగా బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు ధగధగా మెరిసిపోతా ప్రత్యక్షమయినాయి. వాడు ఆనందంతో ఏవి తీసుకుపోవాల్నో అర్థంగాక అన్నీ సంచులు, సంచులు నింపుకోసాగినాడు. అట్లా అన్నీ నింపుకొనే సరికి బాగా చీకటి పడింది. చీకట్లో అడవిలో పోవడం అంత మంచిది కాదు గదా, దాంతో అక్కన్నే పండుకోని పొద్దున్నే పోదామనుకోని ”హాయిగా పండుకోడానికి ఒక మెత్తని పరుపు, మంచం వుంటే ఎంత బాగుండు” అనుకున్నాడు. వాడట్లా మనసులో అనుకోవడం ఆలస్యం ఠక్కున మెత్తని హంసతూలికా తల్పం ప్రత్యక్షమయింది. వాడు ఎగిరి దాని మీదికి దుంకి హాయిగా పడుకున్నాడు.
అది అడవి గదా, దూరం నుండి జంతువుల అరుపులు వానికి వినబడసాగినాయి. దాంతో వానికి భయమేసి ”కొంపదీసి నిద్రపోతా ఉన్నప్పుడు ఏ పులో వచ్చి మీద పడి నన్ను తినదు గదా” అనుకున్నాడు. వాడట్లా మనసులో అనుకోవడం ఆలస్యం, ఠక్కున ఒక పులి ప్రత్యక్షమై ఎగిరి వాని మీదికి దుంకి చంపి తినేసింది.

ఇవి కూడా చదవండి

More: Telugu Short Stories · Stories in 14 languages · Srikaram home

✍️ Have a story or article to share? Submit it for review and get published on Srikaram.org.

📬 Get new stories & lessons by email

Join our free newsletter for new Telugu & English stories, language lessons and parenting tips. No spam, unsubscribe anytime.

Related Posts

Leave a Reply

About Srikaram

Free short stories, bedtime stories and lessons for kids in 14 languages, with discussion questions for parents and teachers.

Email: srikaram@srikaram.org

Explore

Languages

Contact Us

Questions, feedback or partnership ideas? We'd love to hear from you.

srikaram@srikaram.org