ఒక వూరిలో రంగన్న అని ఒక పిల్లోడు వుండేటోడు. వాడు చానా తెలివైనోడు. బడిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మంచి మంచి సలహాలు ఇచ్చి వాళ్ళను ఆపదలనుంచి గటెక్కించేవాడు. అందరూ వానిని ”రేయ్… నీ బుర్ర అలాంటిలాంటి మామూలు బుర్ర కాదురా… నూటికో కోటికో ఒక్కనికుంటాయి నీలాంటి తెలివితేటలు” అని తెగ మెచ్చుకునేటోళ్ళు. నెమ్మదిగా వాడు పెరిగి పెద్దగయ్యాడు. వయసుతో బాటు తెలివితేటలు గూడా బాగా పెరిగాయి. సరే… పెరిగి పెద్దగయినాక సొంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ మన కాళ్ళమీద మనం నిలబడినప్పుడే గదా పదిమందిలో గౌరవం . కానీ వానికి పనివ్వమని చేయి చాచడం నచ్చలేదు. దాంతో ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు.
ఈ లోకంలో తెలివైన వాళ్ళు చానా కొద్దిమంది వుంటే, సొంతంగా ఆలోచించలేని వాళ్ళు, ఇతరుల సలహాల మీద ఆధారపడి బతికేవాళ్ళే ఎక్కువమంది వుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకు అవసరమైన సలహాలు సూచనలు సరసమైన ధరకు అమ్మాలి అనుకున్నాడు. దాంతో ఇంటిముందు అరుగుమీద
”ఇచ్చట సలహాలు అమ్మబడును”
అని పెద్దగా ఒక పలకమీద రాసి తగిలించాడు.
దారినపోయే జనాలంతా అది చూసి ”వాయబ్బో… వచ్చినాడురా పెద్ద తెలివైనోడు. సలహాలమ్ముతాడంట సలహాలు” అని తెగ నవ్వుకునేటోళ్ళు. కానీ వాడు ఎవరినీ పట్టిచ్చుకునేటోడు గాదు.
ఎవరూ చేయనిది, ఏదైనా కొత్తది చేయాలి అనుకున్నప్పుడు అవమానాలు, ఎత్తి పొడుపులు మామూలే గదా. ఎవడైతే వాటిని తట్టుకొని వెనుదిరగక నిలబడగలుగుతాడో వాడే చివరికి విజయాన్ని అందుకుంటాడు
. అలా రెండు నెలలు గడిచిపోయాయి. ఒక్కరంటే ఒక్కరు గూడా వాని ఇంటి తలుపు తట్టలేదు. అయినా వాడు కొంచం గూడా నిరాశపడలేదు. తన తెలివితేటల మీద నమ్మకంతో అవకాశం కోసం ఎదురుచూడ సాగాడు.
ఆ వూరి చుట్టూ చానా మామిడి తోటలు వున్నాయి. అవి చానా తియ్యగా… నోటిలో పెట్టుకుంటే చాలు… ఆహా! తింటే ఇలాంటి పళ్ళే తినాలిరా… అనేంత మధురంగా వుంటాయి. ఎక్కడెక్కడినుంచో పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి, ఎంత ధర చెబితే అంత ధర వాళ్ళ చేతిలో పెట్టి పళ్ళు కొనుక్కుంటా వుంటారు. కానీ ఆ ఏడాది మామిడి పళ్ళ రైతులకు వూహించని ఆపద ఒకటి వచ్చి పడింది. ఎక్కడినుంచి వచ్చాయో రామచిలుకలు ఒకటి కాదు రెండు కాదు వేలకు వేలు వచ్చి చేరాయి. ఏ తోట చూసినా రామచిలుకలే. పచ్చికాయలను గూడా వదలకుండా కొరకడం మొదలు పెట్టాయి. తినేది తక్కువ పాడు చేసేది ఎక్కువ. ఎంత తోలినా పోయినట్టే పోయి మరలా వాలుతున్నాయి. రైతులకు కంటిమీద కునుకు లేదు. తమ తోటలని ఎలా కాపాడుకోవాలో తెలీక తలలు కొట్టుకోసాగారు.
అప్పుడొక రైతు ”రేయ్… మా వీధిలో రంగన్న అని ఒకడున్నాడు. వాడు చానా తెలివైనోడు. కానీ సలహాలు ఎవరికీ ఉచితంగా ఇవ్వడు. వాన్ని పోయి అడుగుదామా” అన్నాడు. ”సరే! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు పోయి అడుగుదాం పాండి. నచ్చితే అడిగినంత ఇద్దాం” అనుకుంటా అందరూ కట్టకట్టుకొని రంగన్న వద్దకు వచ్చారు.
రంగన్న జరిగిందంతా విని బాగా ఆలోచించి ఒక్కొక్క రైతు ఒక్కొక్క వరహా నాముందు పెడితే చిలకల బెడద తొలగిపోయే దారి చెబుతా అన్నాడు. సరేనని అందరూ తలా ఒక వరహా ముందు పెట్టారు.
అప్పుడు వాడు ”మీరు పోయి చెట్టు చిటారు కొమ్మలకు చిన్న చిన్న గంటలు అక్కడక్కడ కట్టండి. చిలుకలు వచ్చి పళ్ళమీద వాలినపుడు గానీ, సర్రుమని గాలి వీచినప్పుడు గానీ అవి కదిలి గణగణగణమని గంటలు మోగుతాయి. ఆ చప్పుడుకు బెదిరి చిలుకలు అక్కన్నించి తుర్రుమని ఎగిరిపోతాయి” అని చెప్పాడు.
వెంటనే రైతులందరూ రంగన్న చెప్పినట్టే మామిడి పళ్ళ చెట్టు కొమ్మలకు గంటలు కట్టారు. అవి గణగణగణమని మోగుతావుంటే ఆ చప్పుళ్ళకు భయపడి చిలుకలు మామిడిపళ్ళ దగ్గరకు రావడం మానేశాయి. దాంతో రైతులకు చిలుకల బెడద తప్పిపోయింది. ఆ దెబ్బతో రంగన్న పేరు వూరు వూరంతా మోగిపోయింది. ఇంకేముంది వూరిలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా వురుక్కుంటా సలహాల కోసం రంగన్న దగ్గరకి రావడం మొదలు పెట్టారు.
ఆ వూరికి పక్కనే వున్న ఆనందపురంలో ఒక ధనవంతుడు వున్నాడు. ఆయన ఒకసారి రంగన్న దగ్గరికి వచ్చాడు. ”నాకు వుండేది ఒక్కగానొక్క కొడుకు. వాన్ని అల్లారుముద్దుగా అడిగింది కాదనకుండా కాలు కిందపెట్టకుండా పెంచాను. కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు. వానికి తిండియావ బాగా పెరిగింది. ఎప్పుడూ ఏదో ఒకటి నమలకుండా వుండలేడు. తినేది గంగాళమంత, పనిచేసేది గుండుసూదంత. దాంతో రోజురోజుకీ లావయిపోతా ఇప్పటికే వుండవలసిన దానికన్నా మూడింతలు పెరిగాడు. చూసి చూసి వాన్ని నేను తిట్టలేను. తన్నలేను. తినకుండా ఆపలేను. కానీ వాడు ఇలాగే లావయితూ పోతే చిన్నప్పుడే అనేక రోగాల బారిన పడడం ఖాయం! అందుకని వానంతట వాడే తగ్గిపోయేలా ఏదయినా దారి వుంటే చెప్పండి’ అన్నాడు.
రంగన్న బాగా ఆలోచించి వాని చెవిలో ఒక ఉపాయం చెప్పాడు. వాడు సరేనని తరువాత రోజు ఆ పిల్లోడు తినే జిలేబీలో కొంచం మత్తుమందు కలిపాడు. అది తిన్న కాసేపటికే ఆ పిల్లోనికి మబ్బొచ్చి దారిలోనే దభీమని కిందపడిపోయాడు. అలా వరుసగా వారం రోజులు మత్తుమంది కలిపాడు. పిల్లోడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ బడితే అక్కడ తూలి పడిపోసాగాడు. దాంతో ఆ పిల్లోనికి తనకేమో అయిందని భయం పట్టుకొంది. అప్పుడు వాళ్ళ నాన్న ఆ పిల్లోన్ని రంగన్న దగ్గరికి తీసుకు వచ్చాడు. రంగన్న ఆ పిల్లోన్ని బాగా పరిశీలించనట్టు నటించి ”ఈ పిల్లోడు రెండు మూడు నెలలకంటే ఎక్కువ కాలం బతకడు” అన్నాడు. ఆ మాటలు విని ఆ పిల్లోడు అదిరిపడ్డాడు.
”చూడు బాబూ… ఇప్పటికే నీవు వుండవలసిన దానికంటే మూడింతల బరువు వున్నావు. ఇంక ఒక్క కేజీ లావయినా సరే నీ సావు నీవు కొని తెచ్చుకున్నట్టే. ఎంత తొందరగా సన్నబడితే అంత మందిది. బతకడమో, చావడమో నీ చేతుల్లోనే వుంది. నీవే ఆలోచించుకో” అన్నాడు.
ఈ లోకంలో పవరైనా సరే తొందరగా చావాలనుకోరు గదా! దాంతో ఆపిల్లోనికి చావు భయం పట్టుకుంది. తిండి కనబడితే చాలు దూరంగా పారిపోసాగాడు. రోజూ నాలుగైదు మైళ్ళు నడవడం మొదలు పెట్టాడు. అలా ఐదారునెలలు దాటే సరికి సన్నగా నాజూకుగా, మునక్కాయలాగా మారిపోయాడు. అదంతా రంగన్న సలహానే అని తెలిసి అందరూ బాగా మెచ్చుకున్నారు. ఆవూరిలోనే కాక చుట్టుపక్కలంతా గూడ రంగన్న పేరు పాకిపోయింది.
ఆ వూరికి చాలా దూరంలో కందనవోలు అనే ఒక పెద్ద దేశం వుంది. దానిని పాలించే రాజు చానా మంచోడు. అతని పరిపాలనలో జనాలంతా హాయిగా కాలుమీద కాలేసుకోని సుఖసంతోషాలతో బతుకుతా వుండేటోళ్ళు. కానీ ఎక్కడినుంచి వచ్చి పడిందో ఏమో గాని ఒక పెద్ద దొంగలగుంపు కందనవోలులో అడుగు పెట్టింది. రోజుకో ఇళ్ళు దోచుకోసాగింది. దాంతో జనాలంతా ఎన్ని పనులున్నా ఇళ్ళు దాటి బైటకి అడుగు పెట్టడానికి భయపడసాగారు. సైనికులు దొంగల కోసం వీధి వీధి గాలించసాగారు కాని ఎన్ని రోజులు గాలించినా ఒక్క దొంగా దొరకక పోగా దొంగతనాలు మరింత పెరిగిపోసాగాయి. దాంతో రాజు సైనికాధికారిని పిలిచి నీ పని దొంగతనాలను అరికట్టి అందరూ హాయిగా వుండేలా చూడడం. కానీ ఇన్ని రోజులుగా దొంగతనాలు జరుగుతున్నా నువ్వు నీ సైనికులు ఒకన్ని కూడా పట్టుకోలేక పోయారు. ఇది నీకే కాదు రాజునైన నాకు గూడా సిగ్గు చేటు. వారం రోజుల్లోగా దొంగతనాలు ఆగిపోవాలి. ఆగకపోతే ఆ మరుసటి రోజే నీ మెడమీద తలకాయ వుండదు” అంటూ కోపంగా హెచ్చరించాడు.
సైనికాధికారికి ఏం చేయాలో తోచలేదు. కాపలా ఎంత పెంచినా దొంగలు దొరకడం లేదు. అప్పుడు వానికి సలహాల రంగన్న గురించి తెలిసింది. వెంటనే రంగన్న దగ్గరికి వచ్చి జరిగిందంతా వివరించి ”ఎలాగైనా సరే ఈ దొంగతనాలు ఆగిపోయేలా ఒక మంచి సలహా ఇవ్వు. లేదంటే నాకు చావు తప్పదు” అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. రంగన్న సరేనని బాగా ఆలోచించి ”సైనికులు ఎన్ని ఇళ్ళకని కాపలా వుంటారు. ఎంతమందినని కాపాడుతారు? ఒక వీధిలో తిరుగుతా వుంటే మరొక వీధిలో దొంగలు దోచుకుని పోతావుంటారు. ఇంటింటికీ ఒక సైనికున్ని కాపలా పెడితే తప్ప దొంగల ఆట కట్టదు. కానీ అంతమంది సైనికులు ఏ రాజు వద్దా వుండరు. కాబట్టి ఒక పని చెయ్యి” అంటూ ఏం చెయ్యాలో వివరించాడు.
వెంటనే సైనికాధికారి తరువాత రోజు దేశమంతా వీధివీధినా ”ఎవరైతే దొంగలను పట్టుకుంటారో వాళ్ళకి లక్ష బంగారు వరహాలు కానుకగా ఇవ్వడమే గాక, రాజు కొలువులో వున్నత పదవిలో నియమించడం జరుగుతుందని” దండోరా వేయించాడు. లక్ష వరహాలంటే మాటలు కాదు గదా. దానికి తోడు రాజు కొలువులో వున్నత పదవి. దాంతో జనాలంతా ఆశపడి చీకటి పడగానే తలా ఒక కట్టె తీసుకుని దొంగలకోసం వెదకడం మొదలు పెట్టారు. ఏ వీధి చూసినా జనాలే. దాంతో దొంగలకు బైట అడుగు పెట్టడానికి గూడా వీలుపడలేదు. ఇంక ఈ వూరిలో మరికొద్ది రోజులుంటే పట్టుబడి చావడం ఖాయం అనుకొని మట్టసంగా ఆ వూరిని వదిలి పారిపోయారు. దాంతో మరలా ఆరోజునుంచే ఒక చిన్న దొంగతనం గూడా అక్కడ జరగలేదు. దాంతో రాజు చానా సంబరపడి సైనికాధికారిని మెచ్చుకున్నాడు. దానికా సైనికాధికారి ”మహారాజా!… ఇందులో నా గొప్పతనమేమీ లేదు. మనూరిలో సలహాల రంగన్నని ఒకడున్నాడు.” అంటూ జరిగిందంతా నిజాయితీగా చెప్పాడు. దాంతో రంగన్న పేరు రాజభవనమంతా మోగిపోయింది.
కందనవోలుకు పక్కనే సరిహద్దుల్లో ఒక పెద్ద నది పారుతావుంది. ఆ నదికి అవతల చాలా దూరంలో అవంతీపురం అనే పెద్ద నగరం వుంది. దానికి రాజు గజసింహుడు. అతనికి ఈ లోకాన్నంతా జయించాలని విపరీతమైన దురాశ. దానితో ఒక్కొక్క రాజు మీదకు దాడిచేసి, వాళ్ళ కోటలను నాశనం చేసి, అందరినీ పట్టుకొని కారాగారంలో బంధించసాగాడు. గజసింహుని కన్ను కందనవోలు మీద పడింది. దానిని జయించాలని కొన్ని వేలమంది సైనికులను వెంటపెట్టుకొని, పెద్ద పెద్ద ఆయుధాలతో బైలుదేరాడు. ఆ విషయం కందనవోలు రాజుకు తెలిసింది. తన దగ్గరున్న సైనికులు, ఆయుధాలు చాలా తక్కువ. ఓడిపోతే నగరమంతా నాశనమవుతుంది. జనాలంతా బంధీలుగా చిక్కి నానా బాధలు పడతారు. తన నగరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎంత ఆలోచించినా తోచలేదు. అంతలో సైనికాధికారి చెప్పిన సలహాల రంగన్న గురించి మతికి వచ్చింది.
Hari Kishan, [3/26/2023 8:52 PM]
ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. పోయి ఆ రంగన్నని పెలుచుకోని రాపోండి. ఈ ఆపదను ఎలా గట్టెక్కాలో ఏమయినా సలహా చెబుతాడేమో చూద్దాం అన్నాడు.
సైనికాధికారి పోయి రంగన్నను పిలుచుకొని వచ్చాడు. రంగన్న జరిగిందంతా విని బాగా ఆలోచించి ”రాజా… మీవద్ద మందుగుండు ఫిరంగులు ఎన్ని వున్నాయి” అని అడిగాడు. దానికి రాజు ”ఎన్నో లేవు. ఒక ముప్పయ్యో నలభయ్యో వుంటాయంతే” అన్నాడు. ”రాజా! యుద్ధంలో గెలుపు ఓటములు సైనిక బలంకన్నా ఫిరంగుల బలం మీదనే పక్కువగా ఆధారపడి వుంటాయి. గజసింహుని వద్ద వందకు పైగా పెద్ద పెద్ద ఫిరంగులున్నాయి. వాటితో ఎంత బలమైన కోటనయినా బద్దలు కొట్టగలగుతున్నాడు. సైనికులు ఆ బాంబులదాడికి తట్టుకోలేక చెల్లాచెదురు అవుతున్నారు. దాంతో విజయం వారికి సులభంగా చిక్కుతోంది. కాబట్టి మనం వాళ్ళకన్నా ఎక్కువ ఫిరంగులు యుద్ధరంగంలోకి దించాలి. అప్పుడుగానీ మనకు విజయం వరించదు” అన్నాడు.
”ఇప్పటికిప్పుడు అన్ని ఫిరంగులు తయారు చేయాలంటే అది జరిగేపని కాదు గానీ ఇంకొక సలహా ఇవ్వు” అన్నాడు రాజు.
రంగన్న చిరునవ్వు నవ్వి ”రాజా… ఇప్పటికిప్పుడు ఇనుముతో నిజమైన ఫిరంగులు తయారు చేయడం అంటే జరిగేపని కాదని నాకూ తెలుసు. కానీ అట్టముక్కలతో, చెక్కముక్కలతో పెద్ద పెద్ద ఫిరంగులు తయారు చేసి, వాటికి నల్లరంగు వేసి అచ్చం నిజం ఫిరంగుల్లాగే తయారు చేయడం పెద్ద పనేం కాదనుకుంటా ఏమంటారు” అన్నాడు.
”బొమ్మ ఫిరంగులు చేయడం సులభమే… కానీ వాటివల్ల ఏం లాభం” అన్నాడు సైనికాధికారి.
”ఏమీ లేదు… మనం మన గూఢచారులతో కందనవోలంతా ఒక పుకారు లేవదీయాలి. మన రాజు ఎప్పటినుంచో ఎవరికీ తెలియకుండా పెద్ద పెద్ద ఫిరంగులు తయారు చేయించి భూమిలోపల సొరంగంలో దాచి పెడతావున్నాడు. అవి వెయ్యికి పైగా వుంటాయి. ఇప్పుడు వాటిని బైటకు తీసి యుద్ధంలో వాడబోతున్నాడు అని. ఆ మాటలు ఒకరినుంచి మరొకరికి చేరి నిమిషాల్లో కందనవోలంతా పాకిపోతుంది. యుద్ధానికి ముందు ఏ రాజయినా సరే ఎదుటివాని బలాబలాలు పసిగట్టడం కోసం తమ గూఢచారులను ఆ నగరానికి పంపుతారు. కాబట్టి గజసింహుని గూఢచారులు గూడా ఇక్కడ మన కందనవోలులో తిరుగుతావుంటారు. వాళ్ళు వెంటనే ఈ విషయం వాళ్ళ రాజుకి తెలుపుతారు. అంతలోపు మీరు పెద్ద పెద్ద బొమ్మ ఫిరంగులు తయారు చేయించి కోటపై భాగాన ఒక్కొక్కటి వరుసగా నిలబెడతా వుండండి. ఇక జరిగేది మీరే చూద్దురు గానీ” అన్నాడు.
కందనవోలు రాజు రంగన్న చెప్పినట్టే చేశాడు. గూఢచారుల నుంచి విషయం తెలుసుకున్న గజసింహుడు అది నిజమేననుకొని ”అమ్మో… అన్ని ఫిరంగులున్నాయా వాళ్ళ దగ్గర. ముందే విషయం తెలిసింది కాబట్టి బతికిపోయాం. తొందరపడి దాడి చేసింటే ఇంకేమన్నా వుందా… ఆ ఫిరంగుల దెబ్బకి మన సైనికులంతా చెల్లా చెదురయి పోయేవాళ్ళు” అనుకుని తన సైనికులతో నెమ్మదిగా అక్కడనుంచి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
చిన్న గొడవగూడా జరగకుండా కందనవోలు నగరాన్ని కాపాడినందుకు రాజు చాలా సంబరపడ్డాడు. రంగన్నకి మోయలేనన్ని విలువైన కానుకలు అందించడమే గాక మంచి జీతమిచ్చి తన సలహాదారుగా నియమించుకున్నాడు.
డా.ఎం.హరికిషన్