ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయనకు చానా పెద్ద చేనుంది. కానీ వాడు పెద్ద పీనాసోడు. ఒకరోజు ఆ రైతు చేనంతా గింజలు చల్లినాడు. వానలు బాగా పడడంతో నెమ్మదిగా అవి బాగా పెరిగి పెద్దగయి కొంతకాలానికి బ్రమ్మాండంగా కంకులేసినాయి.
ఆ పొలం పక్కనే వున్న ఒక చెట్టు మీద ఒక గుడ్లగూబ వుంది. దానికి చిన్న చిన్న పిల్లలు వున్నాయి. దాంతో అది ప్రతిరోజూ రాత్రిపూట వచ్చి ఏదో ఒక కంకి మీద వాలి తిన్నన్ని తిని, మిగిలినవి పిల్లలకు తీసుకోని పోయేది.
రోజుకో కంకి నాశనమయి పోతావుంటే ఒక రోజు రైతు గమనించినాడు. “ఎవరబ్బా ఇట్లా రోజుకొక్క కంకి తినిపోతా వున్నారు” అని చెప్పి ఒకరోజు రాత్రి చేనులో కాపు కాసినాడు. గుడ్లగూబ ఎప్పట్లాగే ఆ రోజు కూడా చీకటి పడగానే గింజల కోసమని వచ్చి కంకుల మీద వాలింది.
అది చూసి ఆ రైతు నెమ్మదిగా వెనుకవైపు నుండి సప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి దాన్ని లటుక్కున పట్టేసుకున్నాడు. వాడు దాన్ని అట్లా పట్టేసుకోగానే అది భయంతో “ఇడ్చు ఇడ్చు పొరపాటయిపోయింది. మల్లా జన్మలో నీ చేనుకాడికి రాను. నాకు చిన్న చిన్న పిల్లలున్నాయి. వదిలెయ్” అని ఎంత ఏడ్చినా వాని మనసు కరగలేదు. “నువ్వు నా గింజలు తిన్నావు గాబట్టి నేను నిన్ను కూర చేసుకోని తింటాను. అప్పుడుగానీ నా కసి తీరదు” అన్నాడు.
వాడు ఆ గుడ్లగూబను తీసుకోని వస్తా వుంటే దారిలో ఒక రైతు ఎదురుగా వస్తా కనబన్నాడు. వాన్ని చూసిన వెంటనే ఆ గుడ్లగూబ
*గూగూ… గూగూ….గుడిసే వుందీ…
గుడిసే లోనా పిల్లలున్నాయ్…
పిల్లల కోసం వదలమని చెప్పు…
వదుల్తే మల్లా ఎప్పుడు రాను…” అనింది.
అది విన్న ఆ రైతు “పాపం దానికి చిన్న చిన్న పిల్లలున్నాయంట. ఈ ఒక్కసారికి వదిలెయ్యి మల్లా రానంటుంది గదా” అన్నాడు. కానీ వాడు
“తింటే దీని కూరే తినాల…
నముల్తే దీని కండే నమలాల… కొరుకుతే దీని ఎముకే కొరకాల…
తాగితే దీని చారే తాగాల…” అన్నాడే గానీ వదలలేదు. దారిలో ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా పట్టిచ్చుకోకుండా ఇంటికి వచ్చి దాన్ని గంప కింద మూసి పెట్టినాడు.
వాని పెండ్లాం ఇంటి బైట రోట్లో వడ్లు దంచుతా వుంటే ఆమె దగ్గరకు పోయి “ఓ సేవ్! నేను గంప కింద ఒకటి తెచ్చి పెట్టినా. దాన్ని మసాలా యేసి బాగా కూర చేసి పెట్టు. అంతలోపు నేను ఊర్లోకి పోయొస్తా” అని చెప్పి పోయినాడే గానీ గంప కింద ఏమి పెట్నాడో చెప్పడం మాత్రం మరచిపోయినాడు.
కాసేపటికి పక్కింటామె “అకా! అకా! కాస్త ఈ గంటె నిండా నూనె ఇస్తావా, పప్పులోకి తిరువాత ఎయ్యాల” అంటా వచ్చింది. కానీ ఆమె వడ్లు దంచుతా వుంది గదా “నా చేతులు ఖాళీగా లేవు గానీ నువ్వే పోయి పోసుకోపో, వంటింట్లో వుంటాది” అనింది. సరేనని ఆ పక్కింటామె లోపలికి అడుగు పెట్టగానే ఆమెను చూసిన గుడ్లగూబ వెంటనే
“గూగూ… గూగూ….గుడిసే వుందీ…
గుడిసే లోనా పిల్లాలున్నాయ్…
పిల్లల కోసం వదలమని చెప్పు…
వదుల్తే మల్లా ఎప్పుడు రాను” అనింది.
ఆమె అయ్యో పాపమని జాలిపడి గంప లేపింది. ఇంతే ఇది తుర్రున ఎగిరిపోయింది.
గంప కింద ఏదో ఒకటి పెట్టకుంటే బాగుండదని ఆమె బెరబెరా వెనక్కి వచ్చింది. అది చూసి ఆమె “ఏమక్కా నూనె తీస్కోకుండానే పోతా వున్నావ్” అనడిగింది. దానికామె “ఏంలేదు పొయ్యి మీద పాలు పెట్టి మరిచొచ్చినా, పొంగిపోయినాయో ఏమో చూసొస్తానాగు” అని వురుక్కుంటా పోయింది. అట్లా పోయి గంపకింద ఏమి పెడదామా అని ఇంటి వెనకాల వెదుకుతా వుంటే ఒక పిచ్చికుక్క కనబడింది. ఆమె మట్టసంగా దాన్ని చీర దాపున దాచిపెట్టుకోని మల్లా వచ్చి ఆ గంప కింద పెట్టేసి ఏమీ తెలీని నంగనాచి లెక్క నూనె తీసుకోని వెళ్ళిపోయింది
ఇదంతా ఆమెకు తెలీదు గదా. వడ్లు దంచడం పూర్తి కాగానే మొగుడేం తెచ్చినాడో చూసొద్దామని పోయి గంప లేపి చూస్తే ఇంగేముంది పిచ్చి కుక్క కనబడింది. “ఇదేందబ్బా! పిచ్చికుక్కను తెచ్చుకున్నాడు. ఎవరయినా తింటారా దీన్ని” అనుకోని “నాకెందుకొచ్చిందిలే! వానికసలే ముక్కు మీద కోపం…” అనుకోని దాన్నే కోసి వండి పెట్టింది.
వానికిదంతా తెలీదు గదా. ఇంటికి రాగానే బెరబెరా కాళ్ళూ చేతులు కడుక్కోని, పళ్ళెం ముందు పెట్టుకోని కూచున్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా గమ్మున వాని పళ్ళెంలో కుక్కకూర ఏసి బైటికి పోయింది. వానికది కుక్కకూరని తెలీదు గదా. గుడ్లగూబ కూరే అనుకోని దాన్ని లొట్టలేసుకుంటా తినడం మొదలు పెట్టినాడు. అంతలో
“తింటే నా కూరే తినాల…
నమిలితే నా కండే నమలాల…
కొరుకుతే నా ఎముకే కొరకాల…
తాగుతే నా చారే తాగాల… అంతేగానీ…….
కుక్కకూర తింటారా ఎవరయినా…” అని వినబడింది.
“ఎవరబ్బా ఇట్లా ఎగతాళి చేస్తా వున్నారు” అని తలెత్తి చూస్తే మిద్దెపైన కూచోని కిందా మీదా పడి నవ్వుతా వున్న గుడ్లగూబ ఆ రైతు చూడగానే “వ్వె…వ్వె.,.వ్వె….” అని వెక్కిరిస్తా అక్కన్నించి ఎగిరిపోయింది.
డా.ఎం.హరికిషన్