శివయ్యకు రమ అనే కూతురుంది. ఆమె చక్కదనాల చుక్క. కాలు కింద పెట్టనీయకుండా అల్లారుముద్దుగా పెంచుకునేటోడు. నెమ్మదిగా ఆ పాప పెరిగి పెద్దగయింది. పెద్దగయినాక పెళ్ళి చేయాలి గదా దాంతో సంబంధాలు వెదకాలి అనుకున్నాడు.
శివయ్యకు రాముడు, శేఖరుడు అని ఇద్దరు మేనల్లుళ్ళు వున్నారు. వాళ్ళిద్దరూ రమను ‘నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటా’నంటా ముందుకు వచ్చినారు. ఇద్దరూ బాగా చదువుకున్నోళ్ళే. డబ్బున్నోళ్ళే. దాంతో శివయ్య ఇద్దరినీ పిలిచి ‘మీలో నాకు ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. ఇద్దరూ ఒకటే. కానీ నేనొక పరీక్ష పెడతాను. అందులో గెలిచిన వాళ్ళకే నా కూతురును ఇచ్చి పెళ్ళి జరుపుతా. సరేనా” అన్నాడు.
ఇద్దరూ ‘సరే’ అన్నారు.
శివయ్య తరువాత రోజు పొద్దున్నే ఇద్దరినీ వూరికి దూరంగా వున్న ఒక కొండ దగ్గరకు పిలుచుకోని పోయినాడు. ”మీలో ఎవరైతే ముందుగా ఆ కొండను ఎక్కి అక్కడున్న గుడిని చేరుకుంటారో వాళ్ళే నాకు కాబోయే అల్లుడు” అన్నాడు.
ఆ కొండ చానా ఎత్తుగా వుంటాది. పైకి ఎక్కడానికి సరియైన దారి గూడా లేదు. అంతా ముళ్ళ పొదలు, నున్నని రాళ్ళు, అడుగడుగునా పాములూ, తేళ్ళతో నిండి వుంది. దాంతో శేఖరుడు ”అమ్మో ఆ కొండనా… నావల్ల కాదు. ఇంకేదయినా పోటీ పెట్టు” అన్నాడు. కానీ రాముడు కొంచం కూడా వెనుకడుగు వేయకుండా ”రమను పెళ్ళి చేసుకోవడం కోసం నేను ఏ పోటీకయినా సిద్ధమే. ఎప్పుడు పోటీ” అంటూ ముందుకు వచ్చినాడు.
”సరే… ఐతే నువ్వు ఒక్కనివే పోయి రాపో చూద్దాం” అన్నాడు శివయ్య.
వెంటనే రాముడు సరేనని వురుక్కుంటా పోయి కొండ ఎక్కడం మొదలు పెట్టినాడు. అది చానా నున్నగా, జారుడుగా, ముళ్ళ పొదలతో వుంది గదా…. దాంతో కొంచం దూరం ఎక్కినాక పట్టు తప్పి కాలు జారి ఒకచోట కిందపన్నాడు. ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి. అయినా సరే రాముడు కొంచం గూడా వెనుకడుగు వేయకుండా మళ్ళా ఎక్కడం మొదలుపెట్టినాడు.
అది చూసి శేఖరుడు ”నేను ముందే చెప్పాగదా దాన్ని ఎక్కడం అంత సులభం కాదని. వానికి కొంచం గూడా తెలివి లేదు. అందుకనే ఒకసారి కిందపన్నా కొంచం గూడా ఆలోచించకుండా మళ్ళా ఎక్కుతా వున్నాడు” అని తిట్టినాడు.
ఆ మాటలకు శివయ్య నవ్వుతా ”చూడు శేఖరూ… ఏదయినా ఒక పని చెబితే అడుగు కూడా ముందుకు వేయకుండా నా చేతగాదు అనే నీలాంటోడు ఎప్పటికీ విజయం సాధించలేడు. అసలు పని మొదలుపెట్టని వాని కన్నా, ఓడిపోయినా సరే అడుగు ముందుకు వేసినోడే గొప్పోడు. ఈ రోజు కాకపోయినా రేపయినా విజయం పొందుతాడు. కాబట్టి రాముడే నా కూతురికి తగిన మొగుడు, నాకు అల్లుడు” అన్నాడు.
శేఖరుడు సిగ్గుతో తలదించుకొన్నాడు.
******
డా.ఎం.హరికిషన్