పెళ్ళికాని దోమ (సరదా సరదా జానపద కథ)

ఒకూరిలో ఒక దోమ వుండేది. దానికి ఒకసారి పెళ్ళి చేసుకోవాలని అనిపించింది. దాంతో మంచివాన్ని చూసి పెళ్ళి చేసుకుందామని బైలుదేరింది. దోమ వెదుక్కుంటా పోతావుంటే దారిలో ఒక ఏనుగు ఎదురైంది.

“దోమా…. దోమా… యాడికి పోతా వున్నావు” అని అడిగింది.

దోమ సిగ్గుతో వంకర్లు పోతా “మంచివాన్ని చూసి పెళ్ళి చేసుకోడానికి వెదుక్కుంటా పోతా వున్నా” అని చెప్పింది.

అప్పుడా ఏనుగు “నేను గూడా పెళ్ళి చేసుకోవాలని చానా రోజుల నుండి అనుకుంటా వున్నా. ఈ లోకంలో నా అంత బలవంతుడు ఎవరూ వుండరని నీకు తెలుసు గదా… నన్ను చేసుకో… నీకేం కావాలంటే అది ఇట్లా చెప్పడం ఆలస్యం అట్లా తెచ్చి పెడతా. ఏం సరేనా” అని అడిగింది.

ఆ మాటలకు దోమ కిందామీదా పడి నవ్వుతా “ఏంది… నిన్నా… చాటల్లాంటి చెవులూ, పాములాంటి తొండంతో, ఏడుమూర్ల పొడవు, వెయ్యి కేజీల బరువూ వుంటావు. నిన్ను చేసుకోవాల్నా… ఎప్పుడయినా అద్ధంలో నీ మొగం చూసుకున్నావా” అనింది. ఆ మాటలకు సిగ్గుపడి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

దోమ మళ్ళా బైలుదేరింది. అట్లా పోతావుంటే దానికి ఒకచోట ఒక గుర్రం ఎదురొచ్చింది. “దోమా… దోమా… యాడికి పోతా వున్నావు ” అని అడిగింది.

దోమ సిగ్గుతో వంకర్లు పోతా “మంచివాన్ని చూసి పెళ్ళి చేసుకోడానికి వెదుక్కుంటా పోతా వున్నా” అని చెప్పింది.

అప్పుడా గుర్రం “నేను కూడా పెళ్ళి చేసుకోవాలని చానా రోజుల నుండి అనుకుంటా వున్నా. ఈ లోకంలో నా అంత వేగంగా పరిగెత్తెటోళ్ళు ఎవరూ ఉండరని నీకు తెలుసు గదా… నన్ను చేసుకో… రోజు నా మీద కూచోబెట్టుకోని యాడికి తీసుకు పొమ్మంటే ఆడికి రయ్యి రయ్యిన తీసుకుపోతా… ఏం సరేనా” అని అడిగింది.

ఆ మాటలకు దోమ కిందామీదా పడి నవ్వుతా “ఏందీ… నిన్ను చేసుకోవాల్నా…. తొర్రి పళ్ళతో, కుచ్చు తోకతో ఊరికే తిక్కదాని లెక్క వురుకుతుంటావ్. నీకూ నాకూ పెళ్ళా. ఎప్పుడయినా నీ తొర్రి మొగాన్ని అద్దంలో చూసుకున్నావా” అనింది. ఆ మాటలకు సిగ్గుపడి గుర్రం అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

దోమ మళ్ళా బైలుదేరింది. అట్లా పోతా వుంటే దానికి ఈ సారి ఒక కాకి ఎదురొచ్చింది.

“దోమా… దోమా… యాడికి పోతా వున్నావు” అని అడిగింది. దోమ సిగ్గుతో వంకర్లు పోతా “మంచివాన్ని చూసి పెళ్ళి చేసుకోడానికి వెదుక్కుంటా పోతావున్నా” అని చెప్పింది.

అప్పుడా కాకి “నేను గూడా పెళ్ళి చేసుకోవాలని చానా రోజుల నుండి అనుకుంటా వున్నా… నన్ను చేసుకో… నిన్ను నా రెక్కల మీద కూచోబెట్టుకోని ఆకాశమంతా రయ్యి రయ్యిన తిప్పి చూపిస్తా. రోజు ఎక్కడెక్కడి తినుబండారాలన్నీ ఏరుకోనొచ్చి కమ్మగ కడుపు నిండా బెడతా… ఏం సరేనా” అని అడిగింది.

ఆ మాటలకు దోమ కిందామీదా పడి నవ్వుతా “ఏందీ… నిన్ను చేసుకోవాల్నా… బొగ్గులెక్క కర్రెగా, ఒంటి కంటితో కాకా అని అరుచుకుంటా తిరిగే నీకు నాతో పెళ్ళా… ఎప్పుడయినా నీ తిక్క మొహాన్ని అద్దంలో చూసుకున్నావా” అనింది. ఆ మాటలకు సిగ్గుపడి

కాకి అక్కడినుంచి వెళ్ళిపోయింది. దోమ మళ్ళా బైలుదేరింది. అట్లా పోతా వుంటే దానికి ఒకచోట ఒక ఎర్రమూతి కోతి కనబడింది. అది ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకు… ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకు ఎగురుతా దుంకుతా… కిచకిచమని నవ్వుతా తిరుగుతా వుంటే దోమకు భలే నచ్చేసింది.

దాంతో “కోతి బావా… కోతి బావా… మంచి మొగుడు కావాలని లోకమంతా వెదుకుతా వున్నా. నీ అందమైన ఎర్రమూతి, పొడవైన తోక, కిచకిచమనే నవ్వు నాకు భలే నచ్చినాయి. నన్ను పెళ్ళి చేసుకోవా” అని అడిగింది.

ఆ మాటలకు కోతి కిందామీదా వడి నవ్వుతా “ఏందీ… నిన్ను చేసుకోవాల్నా… ఎప్పుడూ మురికి గుంటల వెంబడి తిరుగుతా, రోగాలను ఒకరి నుండి ఒకరికి అంటించి నంబరపడతా, ఎప్పుడు ఎవరి చేతిలో పుటుక్కున చస్తావో తెలియని నీకూ, నాతో పెళ్ళా. ఎప్పుడయినా నీ తిక్క మొగాన్ని అద్దంలో చూసుకున్నావా” అనింది. ఆ మాటలకు దోమ సిగ్గుతో తల దించుకోని

“ఏడు మూరల ఏనుగును కాదంటీ

తొర్రిపళ్ళ గుర్రాన్ని కాదంటీ ఒంటికంటి కాకినీ కాదంటీ అడిగినోళ్ళందరినీ కాదంటీ ఇప్పుడు నచ్చినోడు నన్ను కాదంటున్నాడే

ఇదేనేమో జీవితమంటే” అని ఏడ్చుకుంటా ఇంటికి పోయింది.

*********

డా.ఎం.హరికిషన్

*********