ఒకూరిలో ఒకడుండేటోడు. వానికి వాని పెండ్లానికి అస్సలు పడేదిగాదు. ప్రతిదానికీ నువ్వెంతంటే… నువ్వెంతంటూ… పందెం కోళ్ళలెక్క గొడవ పడేటోళ్ళు. ఎవరూ కొంచం కూడా వెనక్కి తగ్గేటోళ్ళు కాదు.
ఒకరోజు మొగుడు జొన్నపిండి తీస్కోనొచ్చి రొట్టెలు చేయమని పెండ్లానికిచ్చినాడు. సరే అని ఆమె పిండి తడిపి రొట్టెలు చేస్తే అవి సరిగ్గా ఐదంటే ఐదయినాయి. ఇద్దరికీ తలా రెండు పోతే ఇంకా ఒకటి మిగులుతుంది గదా… దాంతో గొడవ మొదలైంది.
“తెచ్చింది నేను కాబట్టి నాకు మూడు నీకు రెండు” అని వాడు, “కష్టపడి చేసింది నేను కాబట్టి నాకు మూడు నీకు రెండు” అని ఆమె నాకెక్కువంటే నాకెక్కువంటూ కప్పేగిరి పోయేటట్లు అరచుకోసాగినారు.
అప్పుడు మొగుడు “ఇట్లాకాదుగానీ… మనమొక పందెం వేసుకుందాం… ఇద్దరమూ కదలకుండా మెదలకుండా మంచమ్మీద మట్టసంగా పండుకుందాం. ఎవరు మొదట కదిల్తే వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచినోళ్ళకి మూడు. ఓడినోళ్ళకి రెండు… సరేనా” అన్నాడు. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సయ్యంటే సయ్యనింది.
ఇంగచూడు ఇద్దరూ తలా ఒక మంచమ్మీద కదలకుండా మెదలకుండా అచ్చం శవాల్లెక్క బిగదీసుకోని పండుకొన్నారు. గంటయింది….
రెండు గంటలయింది…..
మూడు గంటలయింది…… నాలుగు గంటలయింది……… వూహూ ఒక్కరంటే ఒక్కరు కూడా కదిల్తే ఒట్టు.
అప్పుడే పక్కింటామె తోడుకి కాస్త పెరుగు అడుగుదామని లోపలికొచ్చింది. వచ్చి చూస్తే ఇంగేముంది. ఒకొక్కరూ ఒకొక్క మంచమ్మీద అడ్డంపడి అచ్చం శవాల్లెక్క బిగదీసుకోని పోయి కనబన్నారు. “ఏమయిందబ్బా వీళ్ళకి” అని ఆమె తట్టితట్టి లేపినా లేస్తే ఓడిపోతామని మరింత బిగదీసుకోని పండుకున్నారే గానీ ఒక్కరు గూడా వూ అనలేదు… ఆ అనలేదు…
దాంతో ఆమె వాళ్ళిద్దరూ చచ్చిపోయినారేమో అనుకోని వురుక్కుంటా బయటకు పోయి వూరందరినీ పిలుచుకోనొచ్చింది. వచ్చినోళ్ళందరూ వాళ్ళిద్దరినీ చూసి “అయ్యో… పాపం… నిన్నటి వరకు బాగానే ఉండిరే. రాత్రికి రాత్రి ఏమయిందో ఏమో… ఒకేసారి ఇద్దరూ చచ్చిపోయినారు” అని బాధపడినారు. చచ్చిపోయినోళ్ళని ఇంట్లోనే వుంచరు గదా… శ్మశానానికి తీసుకోని పోవాల… దాంతో వూర్లో వాళ్ళు ఇద్దరినీ కూచోబెట్టి నీళ్ళతో స్నానం చేపిచ్చి… కొత్త బట్టలు తొడిగి… పాడె మీదికి ఎక్కిచ్చినారు. ఇంత జరుగుతావున్నా వాళ్ళు లేస్తేనా… పందెం పందెమే తగ్గేదే లేదు అనుకుంటా అట్లాగే కట్టు కదలకుండా మట్టసంగా ఎట్లున్నవాళ్ళు అట్లాగే వుండిపోయినారు.
వూరు వూరంతా వెంట రాగా వాళ్ళిద్దరినీ మోసుకుంటా…. ముందు తప్పెట్లు మోగుతా వుంటే… పూలు, బొరుగులు, డబ్బులు చల్లుకుంటా… చల్లుకుంటా… ఆఖరికి శ్మశానానికి తీసుకోనొచ్చినారు.
ఇద్దరినీ పాడె మీద నుండి దించి కట్టెల మీద పెట్టి… వాళ్ళ మీద గూడా ఒళ్ళంతా కట్టెలు, పిడకలు పేర్చి ఒకేసారి రెండింటినీ అంటించినారు. అంతే… మంట సుర్రుమని తగిలేసరికి అదిరిపడి ఇద్దరూ ఒకేసారి ఓ అని అరుస్తా పైకి లేచినారు. లేవడం… లేవడం… ఒకరినొకరు చూసుకోని నువ్వు ముందు లేసినావంటే… నువ్వు ముందు లేసినావంటూ… నేను మూడు తింటానంటే… నేను మూడు తింటానంటూ గట్టిగా అరుచుకోసాగినారు.
వచ్చినోళ్ళందరూ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా చితి మీది నుండి అట్లా పైకి లేచేసరికి వీళ్ళు చచ్చి దయ్యాలయినారేమోనని భయంతో గజగజా వణికిపోయినారు. అంతలో “నేను మూడు తింటానంటే.. నేను మూడు తింటానంటూ” వాళ్ళిద్దరూ కొట్లాడుకోవడం చూసి… అవి తమని తినడానికే వంతులేసుకుంటున్నాయని బెదపడి “రేయ్… దయ్యాలు… దయ్యాలొస్తున్నాయి… పారిపోండి….. పారిపోండి” అని అరుచుకుంటా ఎక్కడి వాళ్ళక్కడ వెనక్కి తిరిగి చూడకుండా వూరి వైపు వురకడం మొదలు పెట్టినారు.
దయ్యాలొస్తున్నాయనే సరికి వీళ్ళిద్దరు గూడా అదిరిపడి నిజంగా వస్తున్నాయేమో అనే భయంతో వాళ్ళు గూడా వూరోళ్ళ వెనకాల్నే వురకడం మొదలు పెట్టినారు. అట్లా ముందు వాళ్ళూ… వెనుక వీళ్ళు… ఒకర్ని చూసుకోని ఒకరు కిందా మీదా పడతా వురకడం వురకడం కాదు…
ఆఖరికి విషయం తెల్సుకోని వూరువూరంతా “ఓరినీ.. మీ మీద బండపడ… భయంతో సచ్చినాం గదరా… అనవసరంగా” అని నవ్వుకుంటానే వాళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినారు.
డా.ఎం.హరికిషన్