దొరికిన పోయిన దొంగ (చిన్న కథ)

ఒక ఊరిలో ఒక గజదొంగ వుండేటోడు. గజదొంగ అంటే పెద్ద పెద్ద మీసాలు, చారల చారల అంగీ అలా ఏమీ వుండవు. చూడ్డానికి అందరిలాగే చానా మామూలుగా, సాదాసీదాగా, అమాయకంగా వుండేటోడు. పొద్దున్నే బైలుదేరి అందరితో సరదాగా మాటలాడతా, ఎక్కడెక్కడ ఇళ్ళకు తాళాలు వేసి వున్నాయి. ఏ ఇంటికి ఏ వైపు నుంచి కన్నం వేయవచ్చు, ఏ ఇంటిలో డబ్బు బాగా వుంది అనే విషయాలు కనుక్కునేటోడు. చీకటి పడితే చాలు ఏదో ఒక ఇంటికి కన్నం వేసి గుట్టు చప్పుడు కాకుండా నున్నగా దొరికినవన్నీ కాజేసేటోడు.

రాజ భటులు వాన్ని పట్టుకోలేక తలలు పట్టుకున్నారు. దాంతో రాజు ఎవరైతే వాన్ని పట్టుకుంటారో, వాళ్ళకి పదివేల బంగారు వరహాలు బహుమానంగా ఇచ్చి, కోరుకున్న చోట కొలువు గూడా ఇచ్చి సంతోషపెడతానని దండోరా వేయించినాడు.

ఆ వూరిలో ఒక పెద్ద కొబ్బరి తోట వుంది. దానిలో కొబ్బరినీరు తీయగా చెరుకురసం లెక్క వుంటాది. గజదొంగ కన్ను ఆ కొబ్బరితోట మీద పడింది. దాంతో రోజూ వూరిలో ఎక్కడ దొంగతనం చేసినా ఇంటికి పోయే ముందు ఆ తోటలో దూరి పదికాయలన్నా తెంపుకోని ఇంటికి తీసుకుపోయేటోడు.

ఆ కొబ్బరితోట యజమాని చానా తెలివైనోడు. కానీ ఎంత కాపలా కాసినా దొంగ చిక్కలేదు. తోట చానా పెద్దది గదా… దాంతో ఏదో ఒక వైపునుంచి లటుక్కున వచ్చి ఛటుక్కున కాయలు తెంపుకోని మాయమైపోయేటోడు. దాంతో రోజురోజుకీ కాయలు తక్కువైపోతా వున్నాయి. దాంతో బాగా ఆలోచించి తోటలోని పెద్దపెద్ద కాయలన్నీ తెంపి ఒకే ఒక చెట్టును వదిలేసినాడు. ఆ చెట్టు, పక్కనే వున్న నూతి మీదకు వంగి వుంటుంది.

దొంగ ఎప్పటిలాగే వచ్చినాడు. ఏ చెట్టుకూ లావు కాయలు లేవు. అన్నీ సన్నగా పిందెల్లా వున్నాయి. దాంతో వెదుక్కుంటా నూతి దగ్గరున్న చెట్టు దగ్గరకు వచ్చినాడు. కాయలు లావుగా తళతళలాడుతా వున్నాయి. ఇంకేముంది. బెరబెరా పైకి ఎక్కినాడు. కొబ్బరికాయల దగ్గరికి పోయి మీద చేయి వేసినాడు.

అంతే… పైన కాయల్లో పెట్టిన కొబ్బరినూనె గిన్నె ఒలికి దభీమని వానిమీద, చెట్టు మీద అంతా పడింది. అంతే దొంగకు పట్టు తప్పింది. ఇంకేముంది సర్రున జారి దభీమని కింద వున్న బావిలో పన్నా డు. పైకి రాలేక లోపలనే లబోదిబోమంటూ మొత్తుకో సాగినాడు. తోట యజమాని విషయం రాజుకి చేరవేసినాడు. పొద్దున్నే రాజభటులు వచ్చి వానిని బైటకు లాగి పట్టుకుపోయినారు.

రాజు తోట యజమానిని బాగా మెచ్చుకోని ముందే చెప్పినట్టు, పదివేల బంగారు వరహాలు ఇచ్చి గౌరవించినాడు.


డా.ఎం.హరికిషన్-

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply