ఎవడూ తక్కువోడు కాదు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)

ఒకూర్లో ఒక దుబ్బోడు, ఒక బక్కోడు వుండేటోళ్ళు. వాళ్ళు మంచి స్నేహితులు. ఎప్పుడూ ఒకరి భుజమ్మీద ఇంకొకరు చెయ్యేసుకోని కిలకిలకిల నవ్వుకుంటా పొద్దున లేసినప్పటి నుంచి రాత్రి పండుకునే దాకా ఒకరినొదిలి ఒకరు వుండేటోళ్లు కాదు. “రేయ్… నేను ముందు సస్తే నువ్వు ఎత్తుకోని పోయి కాల్చాల. నువ్వు ముందు సస్తే నేను ఎత్తుకొని పోయి కాల్చాల. అంతే తప్ప అమ్మా నాయన, పెండ్లాం బిడ్డలు ఎవరూ మనల్ని ముట్టుకోగూడదు” అనుకునేటోళ్ళు.
కానీ వాళ్ళు ఏ పనీ చేసేటోళ్ళు గాదు. ఎప్పుడూ సొల్లు కబుర్లు చెప్పుకుంటా బేవార్సుగా తిరిగేటోళ్ళు. దాంతో వాళ్ళమ్మ నాయనలు “వీళ్ళని ఇట్లాగే వదిలేస్తే లాభం లేదని” ఇద్దరికీ పెండ్లి చేసినారు. కానీ వాళ్ళు పెండ్లయి పిల్లలు పుట్టినా… కొంచం గూడా మారలేదు. దాంతో ఇంట్లో వాళ్ళు “రేయ్… మిమ్మల్ని చూసుకోవడమే కష్టమనుకుంటా వుంటే మళ్ళా మీ పెండ్లాం బిడ్డల్ని గూడా చూసుకోవడం మావల్ల కాదు. ఏదో ఒక పని చేయనన్నా చేయండి. లేదా పెండ్లాం బిడ్డలతో యాడికన్నా పోయి మీ బదుకు మీరన్నా బతకండి.” అంటా తెగేసి చెప్పినారు.
దాంతో దుబ్బోడు బక్కోనితో “రేయ్.. ఇట్లా అందరితో మాటలు పడతా ఇంకా ఎంతకాలం బతకాల. నెత్తి మీదికి నలభైయేళ్ళు వస్తా వున్నాయి. ఇద్దరమూ చెరీ ఒక యాపారం చేద్దాం. మా ఇంటి పక్కనే కంసలోళ్ళు వున్నారు గదా… సిన్నప్పటి నుంచీ ఆడ తిరిగీ తిరిగీ ఆ పనెట్లా సేస్తారో సూసీ సూసీ నాక్కూడా శానావరకు వచ్చేసింది. మిగతాది గూడా నేర్చేసుకోని బంగారు నగలు చేసేపని మొదలు పెడతా… ఏమంటావు” అన్నాడు.
దానికి బక్కోడు “రేయ్…. నువ్వెట్లా అంటే నేనట్లానే. నేను గూడా నెయ్యి యాపారం మొదలు పెడతా. బొంబాయి నుంచి డబ్బాలు తెప్పించి చుట్టుపక్కల వూర్లకు పోయి అమ్మొస్తా… నూటికి నూరు లాభమొస్తాది” అన్నాడు.
ఆ తరువాత రోజు నుంచీ ఇద్దరూ పనిలో బన్నారు. చేతిలో డబ్బులు పడడం మొదలయ్యేసరికి వాళ్ళకి నెమ్మదిగా మరింత సంపాదించాలనే యావ బాగా పెరిగిపోయింది.
పొద్దస్తమానం దుబ్బోడు నగలు చేస్తా వుంటే, బక్కోడు వూర్లు పట్టుకోని తిరగసాగినాడు. అట్లా ఇద్దరూ సంపాదనలో మునిగిపోయినారు. బక్కోడు ఎప్పుడు వూరికి వచ్చినా దుబ్బోనింటికి పోయి కాసేపన్నా కూచోని వచ్చేటోడు. వాడు ఒకసారి ఒక తులం బంగారం కొనుక్కోనొచ్చి “రేయ్… దీంతో ధగధగలాడి పోయేలా మంచి వుంగరం చేసియ్యి. దాన్ని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకు రావాల. అట్లాగన్నా నీకు దూరంగా వున్నానన్న బాధ కొంచమన్నా పోతాది” అన్నాడు.
దుబ్బోడు సరే అని దాన్ని కరిగిచ్చినాడు. అంతలో వానికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. బక్కోడే గదా…
ఏం అనుమానమొస్తాదిలే అనుకోని, బంగారాన్ని మట్టసంగా దాచిపెట్టేసి, ఒక రాగి వుంగరం మీద బంగారు పూతేసి ఇచ్చినాడు. అది తెలీని బక్కోడు దాన్ని వేలికి పెట్టుకోని వూరూరా తిరగసాగినాడు.
వాడెప్పుడూ ఎండకు ఎండుతా, వానకు తడుస్తా తిరుగుతా వుంటాడు గదా… దాంతో తొందర్లోనే బంగారు పూతంతా పోయి రాగి రంగుకి మారిపోయింది. కానీ వానికి దుబ్బోని మీద కొంచం గూడా అనుమానం రాలేదు. ‘వుంగరం బాగా సాగడానికి కొంచం రాగి ఎక్కువగా కలిపింటాడులే… అందుకే ఎర్రగుంటాది’ అనుకున్నాడు.
వాడట్లో నెయ్యి అమ్ముకుంటా, ఒకొక్క వూరే తిరుగుతా తిరుగుతా ఒకరోజు ఒక కంసలాయన ఇంటికి చేరుకున్నాడు. ఆయన వుంగరం చూసి “అదేంది సామీ.. ఇంత సంపాదిస్తా వుండి గూడా అట్లా రాగి వుంగరం పెట్టుకోని తిరుగుతా వున్నావు. బంగారంది పెట్టుకోవచ్చుగదా” అన్నాడు. ఆ మాటలకు బక్కోడు “అదేంది కంసలాయనా అట్లంటావు. ఇది బంగారానిదే” అన్నాడు. దానికి వాడు నవ్వి “నలభైయేళ్ళ నుంచీ చేస్తున్నా సామీ నగలు… ఏది బంగారమో ఏది రాగో ఆ మాత్రం కనిపెట్టలేనా… ఎవడో గానీ నీకు సక్కగా పంగనామాలు పెట్టేసినాడు” అంటా గీటురాయి తీసుకోనొచ్చి గీసి చూపించినాడు. దాంతో బక్కోనికి నోటమాట రాలేదు..
తరువాత రోజు సక్కగా దుబ్బోనింటికి పోయి “ఏందిరా… బంగారు వుంగరం చేసియ్యమంటే ఇట్లా సత్తుంగరం చేసిచ్చినావు. అందరూ నవ్వుతా వున్నారు. దీన్ని చూసి” అన్నాడు కోపంగా. దానికి దుబ్బోడు “ఏంరా… బక్కోడా… నువ్వు నన్నే అనుమానిస్తా వున్నావా… ఇన్నినాళ్ళలో ఎవరూ ఎప్పుడూ ఒక్కమాట అనలా…. నువ్వు ఒక వూరు గాదు, ఒక దేశం గాదు. యాడాడో తిరుగుతా వుంటావు గదా… ఎవని కన్నో ఆ వుంగరం మీద పడుంటాది. నువ్వు నీళ్ళోసుకునేటప్పుడు వుంగరం తీసి పెడతా వుంటావు గదా. అట్లాంటప్పుడు అచ్చం అట్లాంటిదే ఇంగోటి పెట్టి మార్చేసింటాడు” అన్నాడు. బక్కోడు కోపాన్ని లోపల్లోపలే అణిచేసుకోని మట్టసంగా వచ్చేసినాడు.

దుబ్బోనికి ఇద్దరు బావమరుదులు వున్నారు. వాళ్ళలో పెద్దోనికి పెండ్లి నిశ్చయమైంది. దాంతో వాళ్ళు బావ దగ్గరికి వచ్చి “బావా… పెండ్లికి వచ్చినోళ్ళందరికీ ఘుమఘుమలాడేలా కమ్మని నెయ్యి కావలసినంత పోపిద్దామనుకుంటా వున్నాం. మీ బక్కోని దగ్గర దొరుకుతాదా మాంచిది” అని అడిగినారు. దానికి వాడు నవ్వి ” అదెంత సేపు…. నేను కనుక్కుంటానులే” అని బక్కోన్ని పిలిపిచ్చినాడు.

వాడు సంగతంతా తెలుసుకోని “సరే… తప్పకుండా తెప్పిస్తా… కాకపోతే దుడ్లు ముందే పంపాల. అప్పుడే బొంబాయి నుంచి మంచి నెయ్యి వచ్చేది” అన్నాడు. దాంతో వాళ్ళు సరేనని నాలుగు డబ్బాలకు డబ్బులిచ్చి పోయినారు. వాడు పెండ్లికి వారం రోజుల ముందు ఏం చేసినాడంటే నాలుగు ఖాళీ డబ్బాలు తీసుకోని, దాండ్లను బాగా చిక్కని పెండనీళ్ళతో నింపి, మూత గట్టిగా బిగించి, పైన కొంచం నెయ్యి పూసి బొంబాయి నుంచి వచ్చినాయంటా పంపిచ్చినాడు. వాళ్ళు వాటిని తీసుకోని పోయి భద్రంగా అటక మీద దాచి పెట్టినారు.
పెండ్లిరోజు బంధువులంతా వచ్చినాక అన్నంలో నెయ్యేద్దామని దించి చూస్తే ఇంకేముంది… దేంట్లో చూసినా ఒకటే కంపు. వాసనకే వాంతులు వచ్చేటట్లుంది. దాంతో ఏమీ చెయ్యలేక నెయ్యి లేకుండానే అన్నాలు పెట్టినారు. పెండ్లికొచ్చినోళ్ళంతా “పెండ్లి ఇంత బాగా చేసినారు గానీ ఏం లాభం… వచ్చినోళ్ళకు ఒక్క నెయ్యి చుక్క గూడా విదల్చలేదు” అంటా నానాక మాటలన్నారు. దాంతో అందరి ముందూ దుబ్బోని తల కొట్టేసినట్లయింది.
‘ఎంత మోసం చేసినాడురా బక్కోడు’ అని కోపంగా తరువాత రోజు సక్కగా వానింటికి పోయి “ఏంరా బక్కోడా… నిన్ను నమ్మి ముందే అడిగినన్ని డబ్బులు చేతిలో పెడితే… మంచి నెయ్యని చెప్పి అంత కంపు కొట్టేది ఇస్తావా… ఇదేమన్నా మర్యాదేనా” అన్నాడు.
దానికి వాడు “అదేందనా అంతమాటంటావు. ఇన్ని నాళ్ళలో ఎవరూ ఎప్పుడూ ఎక్కడా నన్ను ఒక్క మాటనలా. నా బంగారు వుంగరం మీద కన్నేసినట్లే… ఎవరో నీ బొంబాయి నెయ్యి మీద కన్నేసి మార్చేసి వుంటారు” అన్నాడు.
దాంతో దుబ్బోనికి నోట్లో వెలక్కాయ వన్నట్లయింది. కక్కలేక మింగలేక తేలు కుట్టిన దొంగలా గమ్మున ఇంటికొచ్చేసినాడు.
అట్లా కొన్నాళ్ళు గడిచిపోయినాయి. అనుకోకుండా ఆ వూళ్ళో పెద్ద కరువు వచ్చింది. వానల్లేవు. పంటల్లేవు. దాంతో వున్న బంగారం కుదువ పెట్టేటోళ్ళు, అమ్మేటోళ్ళే గానీ చేపిచ్చుకునేటోళ్ళు లేకపోయిరి. అట్లాగే నోట్లోకి అన్నం ముద్దకే తనకలాడుతా వున్న జనాలు నెయ్యిని కొనడం మానేసినారు. దాంతో వాళ్ళిద్దరి యాపారాలు దెబ్బతిన్నాయి. ఒకసారి ఇద్దరూ కూచోని “రేయ్.. మనమిట్లా ఈన్నే వుంటే లాభం లేదు. పెద్ద నగరానికి పోదాం. అక్కడ ఏ సరుకులు తక్కువకి దొరుకుతాయో కొనుక్కోని, అవి దొరకని చోట్లకు పోయి అమ్ముదాం. ఇట్లాగే ఏ పనీ చేయకుండా వూరికే కూచుంటే తిండికి లేక అందరం మలమల మాడిపోతాం” అనుకున్నారు. దాంతో ఇద్దరూ ఇండ్లు కుదువ పెట్టి తలా పదివేల వరహాలు అప్పు తీసుకోని నగరానికి బైలుదేరినారు.
అట్లా వాళ్ళు మూడు పగళ్ళూ, మూడు రాత్రులూ నడుచుకుంటా నడుచుకుంటా చివరికి ఒక పెద్ద అడవిలోనికి వచ్చినారు. ఆ అడవిలో దొంగలు చానా ఎక్కువ. వాళ్ళకీ విషయం తెలీక అట్లాగే పోతావుంటే ఒక దొంగల గుంపు అడ్డం వచ్చింది. వాళ్ళు ఇద్దరి గొంతుల మీద కత్తి పెట్టి “మర్యాదగా ఎక్కడివక్కడ దాచి పెట్టుకున్నవన్నీ తీసిస్తారా, చంపి అవతల పాడేయాల్నా” అంటా బెదపడిచ్చినారు. దాంతో వాళ్ళు వణికిపోతా తమ దగ్గరున్న డబ్బులన్నీ తీసి ఇచ్చేసినారు.
దొంగలు పోయినాక ఒకరిని పట్టుకోని ఒకరు కండ్లనీళ్ళు పెట్టుకోని “ఒరేయ్… ఇట్లా ఇద్దరం వూపుకుంటా వుత్త చేతులతో పూరికి పోతే అందరూ నవ్వుతారు. ఏమి చేసయినా సరే సంపాదించుకొనే పోవాల” అనుకోని అట్లాగే కాళ్ళీడ్చుకుంటా తరువాత రోజు చీకటిపడే సమయానికంతా ఆ నగరం దగ్గరికి చేరుకున్నారు.
ఆ నగరానికి ముందు ఒక పెద్ద శ్మశానం వుంది. అందులో ఎవరినో బూడ్చి పెడతా వున్నారు. ఆయన ఎవరా అని ఆరా తీస్తే ఆ వూరిలో పెద్ద వ్యాపారనీ, పది తరాలు పడుకొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించినాడనీ, కానీ ఆయనకు పిల్లాజెల్లా ఎవరూ లేరని, వున్నది ఒక్క పెండ్లామే అనీ తెలిసింది.
దాంతో దుబ్బోడు బక్కోన్ని పిల్చి “రేయ్… నాకో ఉపాయం తట్టింది.. వీళ్ళు పోగానే ఆ గుంత తవ్వి శవాన్ని ఇంకొక చోట బూడ్చేద్దాం. నువ్వు గుంతలో కూర్చో, పైన బండ పెట్టి గాలి ఆడడానికి ఏర్పాటు చేసి మన్నుతో కప్పేస్తా… ఆ తరువాత సక్కగా వాళ్ళింటికి పోయి నీ మొగుడు నాకు లక్ష బంగారు వరహాలు బాకీ వున్నాడని చెప్పి కిందామీదా పడి ఏడుస్తా… ఆ తరువాత…” అంటా వానికి ఏం చేయాల్నో చెప్పి బక్కోన్ని లోపల కూచోబెట్టి, ఎప్పటిలాగే సమాధి తయారు చేసినాడు.
ఆ తరువాత ఆ వ్యాపారి ఇల్లు ఎక్కడో కనుక్కోని సక్కగా వాళ్ళింటికి పోయినాడు. పోవడం పోవడం అందరి ముందూ నెత్తీ నోరూ కొట్టుకుంటా “అయ్యో … సామీ ఎంత ఘోరం చేసినావురా దేవుడా… తినీ తినక దాచి పెట్టుకున్న నా లక్ష వరహాలు నాకు ఇయ్యకుండానే సచ్చిపోయినావా… అప్పుడు నేను నా పెండ్లాం బిడ్డలు వీధిలో పడితే నాకు దిక్కెవర్రా నాయనా” అంటా కిందామీదా పడి పొర్లి పొర్లి ఏడ్బసాగినాడు.
అది చూసి ఆ వ్యాపారి పెండ్లాం “నా మొగుడు బంగారం లాంటోడు. బతికినంత కాలం పదిమంది చేత వంద రకాలుగా పొగిడిచ్చుకున్నాడే గానీ, ఒక్కనితో ఒక్కమాటా అనిపిచ్చుకున్నాడు గాదు. ఎవరివరికి ఎంతెంత ఇవ్వాల్నో పైసా పైసా లెక్కేసి ఇస్తావున్నా… పో… పోయి రాసిచ్చిన కాగితం తీసుకోని రాపో. ఇచ్చేస్తా” అనింది.

See also  తెలివైన రంగన్న మరియు మోసగాళ్ళ సాహసం

దానికి వాడు లబలబమని నెత్తీ నోరూ కొట్టుకుంటా “ఆ కాగితమే వుంటే ఇంత ఏడుపెందుకు తల్లీ నాకు. కాలు మీద కాలేసుకోని కూర్చోని ఇస్తారా సస్తారా అని గొంతు మీద కూసోని దర్జాగా వసూలు చేసుకుంటా వుంటి. ఎప్పుడూ ఓడ మీద సరుకులు తీసుకోని రావడానికి పోయేముందు కావలసినన్ని వరహాలు తీసుకోనిపోయి, తిరిగి రాగానే సరుకులన్నీ అమ్మి సక్కగా ఇంటికొచ్చి పైసా పైసా వడ్డీకట్టి పోయేటోడు. సిన్నప్పటి నుంచి సూస్తావున్నా గదా. బంగారంలాంటి మనిషి. దాంతో మాట మీదే నమ్మకం. మొన్ననే సరుకుల కోసం పోతా వున్నానంటూ లక్ష వరహాలు తీసుకున్నాడు. కానీ ఇంత హఠాత్తుగా గుండెనొప్పాచ్చి మనిషి మనలో లేకుండా పోతాడని కలలో గూడా అనుకోలేదు” అన్నాడు.
దానికి ఆ ఇంట్లో వున్న బంధువులు “ఇట్లా ఎవరంటే వాళ్ళు వచ్చి మాకియ్యాల మాకియ్యాల అంటే మేమెట్లా ఇస్తాం. అదీగాక ఏమోలే అనుకోడానికి పదీ ఇరవై గాదు. ఏకంగా లక్ష వరహాలు. ఏదో ఒక సాక్ష్యం వుండాల్సిందే” అన్నారు.
దాంతో వాడు “నాయనా… ఆ సచ్చిపోయినాయన అందరిలాగా అల్లాటప్పా మనిషిగాడు. నిలువెత్తు బంగారం. ఆడినమాట తప్పనోడు. సచ్చి ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు. ఆత్మ ఇంకా ఎక్కడో ఇక్కడే తచ్చట్లాడుతా వుంటాది. సక్కగా సమాధి దగ్గరికే పోదాం. దాన్నే అడుగుతా, అదే చెబుతాది నాకు ఇవ్వాల్నో వద్దో” అన్నాడు.
ఆ మాటలకు వాళ్ళు “సరే… పోదాం పద. నిజంగా నీకియ్యాలని ఆ సమాధే చెబితే లక్షేం ఖర్మ ఏకంగా రెండు లక్షలే ఇస్తాం” అంటా అందరూ వాన్తో బాటు సమాధి దగ్గరికి వచ్చినారు.
దుబ్బోడు సమాధి చుట్టూ మూడుసార్లు తిరిగి, ఊదికడ్డీలు అంటించి “సామీ… నాకు తెలుసు. నీ ఆత్మ ఇంగా ఇక్కన్నే ఎక్కన్నో తిరుగుతా వుంటాదని, బతికినంతకాలం నిప్పులాగా ఒక్కమాటా పడకుండా బతికినావు. ఇప్పుడు ఈ మచ్చెందుకు? చెప్పు సామీ… మీ వాళ్ళకంతా వినబడేటట్లు చెప్పు. చావడానికి మూడు రోజుల ముందు నీకు లక్ష వరహాలు ఇచ్చినానో లేదో” అన్నాడు గట్టిగా.
వెంటనే లోపలున్న బక్కోడు “నా ఆత్మ పైకి పోలేక కింద వుండలేక తనకలాడుతా వుంది. ఈ ఋణబంధం ఒక్కటి తెంపేస్తే సక్కగా స్వర్గానికి వెళ్ళిపోతా… వాని లక్ష వరహాలు వానికి ఇచ్చేయండి” అన్నాడు గట్టిగా.
దాంతో వాని పెండ్లాం దుబ్బోన్ని ఇంటికి తీసుకోనిపోయి “సచ్చిన నా మొగునితో మళ్ళా మాట్లాడిచ్చినావు. నీ మేలు జన్మలో మరిచిపోను. ఇంతకు ముందే మాటిచ్చినట్లు లక్షకు లక్ష వరహాలు ఇస్తా తీసుకోని పో” అంటా రెండు లక్షల వరహాలు నాలుగు సంచీల నిండా నింపి ఇచ్చింది. వాడవన్నీ గాడిదల మీద వేసుకొని, తిరిగి శ్మశానానికి రాకుండా మట్టసంగా వేరేదారి పట్టుకోని వూరికి బైలుదేరినాడు.
ఇక్కడ బక్కోడు గుంతలో కూచోని ఇంగొస్తాడు… ఇంగొస్తాడు… అనుకుంటా ఎంత సేపు కూచున్నా దుబ్బోడు రాలేదు. దాంతో వానికి ఏందో జరిగింటాదని అనుమానమొచ్చి నానాక తిప్పలు పడి ఆ సమాధి పైనున్న మట్టి రాళ్ళు తొలగించుకోని బైటపన్నాడు. ఆ వ్యాపారి ఇండ్లు యాడుందో కనుక్కోని సక్కగా వాళ్ళింటికి పోయి “అమ్మా… మా అన్నగానీ ఏమైనా వచ్చినాడా లక్ష వరహాల కోసం” అనడిగినాడు. దానికామె “రావడమూ తీసుకోని పోవడమూ రెండూ ఎప్పుడో అయిపోయినాయి” అని చెప్పింది. దాంతో వానికి దుబ్బోడు మోసం చేసినాడని అర్థమైపోయింది.
దాంతో వాడు కాసేపు ఆలోచించి సక్కగా ఒక చెప్పుల అంగడికి పోయి బాగా తళతళలాడిపోయేలా ఒక మాంచి చెప్పుల జత కొన్నాడు. చూస్తే ముచ్చటేస్తాది. ఒక్కసారన్నా కాళ్ళకేసి తొడుక్కోవాలనిపిస్తాది. అంత అందంగా వున్నాయవి. వాటిని సంకన పెట్టుకోని దుబ్బోన్ని వెదుక్కుంటా వురకసాగినాడు. వాడు ఖచ్చితంగా వేరే దారిలోనే పోయింటాడని వూహించి వీడు అట్లాగే పోసాగినాడు. అట్లా చానాదూరం పోయినాక దూరంగా దుబ్బోడు గాడిదలను తోలుకోని పోతా కనబన్నాడు. “అమ్మదొంగా… వుండు నీ పని చెబుతా” అనుకోని వానికి కనబడకుండా చెట్లమాటునా పుట్టలమాటునా దాచిపెట్టుకుంటా దాచిపెట్టుకుంటా వాని కంటే ముందుకు పోయి దారిలో ఒక చెప్పు పడేసినాడు.
దుబ్బోడు వస్తా వస్తా ఆ చెప్పు చూసినాడు. “అబ్బ… ఎంత ముచ్చటగుందీ చెప్పు. వేసుకుంటే ఇట్లాంటిదే వేసుకోవాల” అనుకోని చుట్టూ చూసినాడు. దాని జత ఇంగొకటి యాడన్నా పడుందేమోనని. యాడా కనబళ్ళేదు. దాంతో ఒక చెప్పు ఏం చేసుకుంటాంలే అనుకోని బాధగా దాన్ని అక్కన్నే పడేసి మళ్ళా బైలుదేరినాడు. వాడట్లా పోవడం ఆలస్యం బక్కోడు ఆ చెప్పు ఒక పొదలో దాచి పెట్టేసి మళ్ళా వానికన్నా ముందే పోయి దారికడ్డంగా రెండో చెప్పు పాడేసి ఆన్నే వున్న ఒక చెట్టు పైకెక్కి కూచున్నాడు మట్టసంగా. దుబ్బోడు వస్తా వస్తా ఆ రెండో చెప్పు చూసినాడు.
“అరెరే… ఈడ పడిందా ఇది. ఆ మొదటిది గూడా తెచ్చుకోనుంటే బాగుండెనే. అయినా ఎంత దూరంలే అరగంటలో పోయి తెచ్చుకోవచ్చు” అనుకోని గాడిదలను ఒక చెట్టుకు కట్టేసి వెనక్కి బైలుదేరినాడు. వాడట్లా కనుచూపుమేర దాటడం ఆలస్యం బక్కోడు బెరబెరబెర కిందికి దిగొచ్చి గాడిదలను తోలుకోని బెరబెరా వురికిస్తా వురికిస్తా వూరికి చేరుకున్నాడు.

See also  తెలుగు సాహిత్యంలో విభిన్న శైలులు

ఈడ దుబ్బోడు మొదటి చెప్పు కోసం పోయినాడు గదా… వానికి అది యాడా కనబళ్ళేదు. ‘ఎక్కడబ్బా చూసినాను’ అని వాడట్లా ఇట్లా వెదుకుతా వుంటే…. ఈడ బక్కోడు ఇంటికొచ్చేసి మూటలన్నీ దించి గాడిదలను తన్ని తరిమేసినాడు. ఇంటి వెనుకనున్న పెరట్లో గుంత తవ్వి అన్నీ అందులో దాచిపెట్టేసి పెండ్లాన్ని పిల్చి “దుబ్బోడొచ్చి నేను వచ్చినానా అని అడుగుతాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు నా మొగం గూడా చూల్లేదని చెప్పు. నేను పోయి పూరిబైట బావి లోపల దాచి పెట్టుకుంటా. నాకు రోజూ మద్యాన్నం ఒక వారం రోజులు అన్నం తీసుకోనిరా” అని చెప్పి చేతికి పదివరహాలు ఇచ్చినాడు.
దుబ్బోడు ఆ చెప్పు కోసం వెదికీ వెదికీ నీరసంగా తిరిగొచ్చి చూస్తే ఇంగేముంది… ఈడ గాడిదలూ లేవు. దాండ్ల మీద మూటలూ లేవు. దాంతో వానికి ఇదంతా బక్కోని పనే అని అర్థమైంది. దాంతో సక్కగా వానింటికి వచ్చి “ఏమ్మా… నీ మొగుడు వచ్చినాడా” అని అడిగినాడు. దానికామె “అన్నా… అప్పుడు నీతో బాటు ఇల్లొదిలి పోయిందే… మళ్ళా ఇప్పటివరకు ఈ గడప తొక్కలేదు” అనింది అమాయకంగా మొగం పెట్టి. దాంతో దుబ్బోడు వూరిబైటి చెరకుతోటలో వెదికినాడు. వూరి పక్కనున్న జొన్న చేనులో వెదికినాడు. కొండమీదున్న శివుని గుడిలో వెదికినాడు. ఇంటింటికీ పోయి అడిగినాడు. కానీ వాడు యాడా కనబల్లేదు. దాంతో వాడు ఇట్లా లాభం లేదనుకోని బక్కోని పెండ్లాం రోజూ యాడికి పోతోంది. యాన్నించి వస్తోంది అని దాచిపెట్టుకోని గమనించ సాగినాడు. ఆమె రోజూ వూరిబైటున్న బావికాడికి మద్యాన్నం పోవడం గమనించినాడు. దాంతో ఇందులో ఏదో రహస్యం వుందని మట్టసంగా చప్పుడు చేయకుండా తరువాత రోజు వెంబడించినాడు.
ఆమె బాయికాడికి పోయి “ఓయ్… యాడున్నావు. బెరీన రా, అన్నం తిని పోదువుగానీ” అని పిలవడం ఆలస్యం వాడు బావిలోంచి బైటకొచ్చినాడు. వాడు అన్నం తింటా వుంటే ఆమె “ఇంట్లో నూకలు నిండుకున్నాయి. చేతిలో దుడ్లు లేవు. రేపటికి నేనేమి తినేది. నీకేమి తెచ్చేది. ఇంగా ఎన్ని రోజులు ఇట్లా దాచిపెట్టుకుంటావు” అనింది. దానికి వాడు నవ్వి “ఇంకో నాలుగు రోజులు ఆగు వచ్చేస్తా. ఐనా డబ్బులకు మనకు తక్కువేంది. ఇంటి వెనుక పెరట్లో పొయ్యికాడ ఒక పాత బన్న పెద్ద కాగు వుంది గదా… దానికింద లెక్కలేనన్ని బంగారు వరహాలు వున్నాయి. మట్టసంగా పొయ్యి కావలసినన్ని తీసుకో” అన్నాడు.
ఆ మాటలు విన్న దుబ్పోడు వెంటనే రయ్యిన బాణం లెక్క ఒక్కోని ఇంటికి దూసుకొని పోయినాడు. బక్కోని పెండ్లాం తిరిగి వచ్చే లోపల బాన కింద తవ్వి మూటలన్నీ తీసేసి వున్నదున్నట్లు బూడ్చి పెట్టేసి అన్నించి జారుకున్నాడు. ఆమెకిదంతా తెలీదు గదా… దాంతో తిరిగి వచ్చి చూస్తే ఇంగేముంది ఒక్క పైసా లేదు. దాంతో ఆమె వురుక్కుంటా పోయి జరిగిందంతా మొగునికి చెప్పింది.
“మూటలు మాయమైనాక ఇంగ బావిలో వుండి ఏం లాభం” అనుకోని వాడు బైటకొచ్చి సక్కగా పోయి చూస్తే ఇంగేముంది… పెండ్లాం చెప్పింది నిజమే… ఒక్క వరహా గూడా లేదు. దాంతో వానికి ఇదంతా దుబ్బోని పనే అని అర్ధమై పోయింది. దాంతో సక్కగా దుబ్బోని ఇంటికి పోయినాడు. చూస్తే ఇంగేముంది మంచమ్మీద నీలుక్కోని పడి వున్నాడు. “ఏమైంది” అని అడిగితే దుబ్బోని పెండ్లాం ఇప్పటికే పది రోజులైంది. ఒక్క అచ్చటా లేదు, ముచ్చటా లేదు. మంచం దిగి నడవడం గూడా లేదు. ఇట్లాగే పడివున్నాడు” అంటా ముందే మొగుడు చెప్పింది చెప్పినట్లుగా అప్పచెప్పింది. వాడు ఇంట్లోకి పోయి చూసినాడు. వాన్ని చూడగానే దుబ్బోడు కదలకుండా, మెదలకుండా అచ్చం చచ్చినోని లెక్క అట్లాగే నీలుక్కోని పండుకున్నాడు.
దాంతో బక్కోడు “అయ్యయ్యో జ్వరం అనుకుంటిమి గానీ దుబ్బోడు అసలు ఈ లోకాన్నే వదిలేసి పోయినాడు” అంటా లబలబలబ నెత్తీనోరూ కొట్టుకుంటా వాన్ని ఎత్తి భుజమ్మీద వేసుకోని పోసాగినాడు. అది చూసి పూరోళ్ళందరూ “ఏందిరా… అట్లా ఒక్కనివే ఎత్తుకోని పోతా వున్నావు. దించు తలా ఒక చేయి వేస్తాం” అన్నారు. దానికి వాడు “వద్దు… మా దగ్గరికి ఎవరూ రావద్దు. చిన్నప్పటి నుంచీ మాది ఒకటే మాట. ఒకటే బాట. నేను సస్తే వాడు ఎత్తుకొని పోయి కాల్చాల. వాడు సస్తే నేను ఎత్తుకొని పోయి కాల్చాల. సొంత అమ్మానాయనలైనా, పెండ్లాం బిడ్డలైనా ఎవరూ మధ్యలో ఏలు పెట్టగూడదు. అట్లా ఒట్టేసుకున్నాం” అన్నాడు. ఆ సంగతి వూళ్ళో పసిపిల్లల నుంచి పండుముసలోళ్ళ వరకూ అందరికీ తెలిసిందే గదా… దాంతో వానికి ఎవరూ అడ్డు పెట్టలేదు. దాంతో బక్కోడు వాన్ని సక్కగా శ్మశానానికి తీసుకోని పోయి కిందంతా కట్టెలు పేర్చి అంటిచ్చినాడు.
అంతే… ఒళ్ళంతా సుర్రుమనే సరికి వాడు అదిరిపడి అమ్మా… అబ్బా… అని అరుచుకుంటా పైకి లేచినాడు. “రేయ్… బక్కోడా అయిపోయిందేదో అయిపోయింది. చెరీ సగం పంచుకోని ఇకపై ఎవని బదుకు వాళ్ళు బదుకుదాం. ఇకపై నీ ఇంటికి నేను రాను. నా ఇంటికి నువ్వు రావద్దు. ఇంక ఈ దొంగాట ఆపుదాం… సరేనా” అన్నాడు. ఆ మాటలకు బక్కోడు సరేనని తనకు రావలసిన లక్ష వరహాలు తాను తీసుకోని సంబరంగా వెళ్ళిపోయినాడు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply